వికారాబాద్ : జిల్లాలోని ధారూర్ మండలంలోని కేరెళ్లి – బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో నలుగురి మృతి చెందడం పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటో లో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.