హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ‘మన ఊరుమన బడి / మన బస్తీమన బడి’ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4,394 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో వీటిని నిర్మిస్తామని చెప్పారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, శేరి సుభాష్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, టీ జీవన్‌రెడ్డి, ఏ నర్సిరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మం త్రి సమాధానామిచ్చారు. మెదక్ జిల్లాలో 80 వర కు అదనపు తరగతి గదులున్నాయని సభ దృ ష్టికి తెచ్చారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు 9,123 బడులను కార్పొరేట్‌కు దీటుగా నిర్మిస్తామని తెలిపారు. 10 వేల బడుల్లో గ్రం థాలయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. బడుల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
1,521 బడుల్లో సోలార్ పవర్
రాష్ట్రంలోని 199 ప్రాథమిక, 79 ప్రాథమికోన్నత, 1,243 ఉన్నత పాఠశాలల్లో రూ.32 కోట్లు వెచ్చించి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సబిత తెలిపారు. 200 కుపైగా విద్యార్థులున్న బడుల్లో సోలార్ ప్యానళ్లను బిగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 101 బడుల్లో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చామ ని వివరించారు. పాఠశాల నిర్వహణ గ్రాం ట్‌గా ఇటీవలే రూ.96 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రూ.30 లక్షల లోపు వున్న పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ద్వారా చేపట్టామని చెప్పారు. రూ.30 లక్షలకుపైగా ఉన్న పనుల పూర్తికి టెండర్లను ఆహ్వానించామని తెలిపారు. త్వరలోనే 142 డైట్ లెక్చరర్లు, డిప్యూటీ డీఈవో పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేస్తామని మంత్రి తెలిపారు. ‘మన ఊరు -మన బడి’ యజ్ఞంలాంటి కార్యక్రమమని మంత్రి అన్నారు.