ఖిలావరంగల్, జనవరి 09 : ప్రసిద్ధ కాకతీయులనాటి రాజధాని ఓరుగల్లు కోటలోని(Warangal Fort) శిలా తోరణం అద్భుతమని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్(Minister Rohit Thakur) కొనియాడారు. శుక్రవారం ఆయన ఓరుగల్లు కోటను సందర్శించి కాకతీయుల శిల్పకళ, వాస్తుశిల్ప నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్ కాకతీయుల చరిత్ర, వారి నిర్మాణ శైలి, కళాఖండాల విశిష్టతను వివరించారు. ఒక్కొక్క కళాఖండాన్ని వివరిస్తూ చూపించడంతో మంత్రి ఎంతో ఆసక్తిగా తిలకించారు.
శిలా తోరణం, ఖుష్ మహల్, ఏకశిలా కొండపై ఉన్న స్వయంభు ఆలయం తదితర ప్రదేశాలను సందర్శించిన మంత్రి, ప్రత్యేకంగా శిలా తోరణాన్ని చూసి అది కాకతీయ శిల్పుల గొప్పతనానికి నిదర్శనమని ప్రశంసించారు. అలాగే రాతికోటపై ఉన్న సెంట్రీ టవర్‌పైకి వెళ్లి, అక్కడ నిర్మించిన మెట్ల నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని అభినందించారు.
కాకతీయులు చెరువులు, కోటలు, దేవాలయాల నిర్మాణంలో అపూర్వ ప్రతిభను కనబరిచారని, వారి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి రోహిత్ ఠాగూర్ అన్నారు. ఈ సందర్శనలో ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది, మిల్స్ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్‌తో పాటు రాష్ట్ర అధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, మంత్రి తన వెంట తెచ్చుకున్న కెమెరాల్లో ఈ చారిత్రక కట్టడాలను చిత్రీకరించుకుంటూ వెళ్లారు.