హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగాణ) : మంత్రుల స్విమ్మింగ్ పూల్ కోసం అక్షరాలా రెండున్నర కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల నివాసంలో నిర్మించబోయే అత్యాధునిక ఈత కొలను కోసం రూ.2.63 కోట్లతో టెండర్లు పిలిచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అత్యుత్సాహం చూపడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఓ వైపు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, సంక్షేమం, గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సహించాల్సిన స్పోర్ట్స్ అథారిటీ.. మంత్రుల స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఆరాటపడతుండటం తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగాల జీతభత్యాలకు నిధుల్లేవని ‘నన్ను కోసుకు తిన్నా పైసా లేదు’ అని సభాముఖంగా తెగేసి చెప్పే సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులకు మాత్రం స్విమ్మింగ్ పూల్ నిర్మించేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు, గర్భిణులు, ఇబ్బందులు పడుతుంటే మంత్రులకు స్విమ్మింగ్ పూల్ దేనికి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పే సీఎం.. కరువులో ఇంత ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఈ కొలనులో ఈత కొట్టి ఒలింపిక్ మెడల్ సాధించే మంత్రి ఎవరో..? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.