ఖమ్మం, అక్టోబర్ 6 : ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని అమలు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvwada )అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ఉన్నత పాఠశాలలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ‘సీఎం బ్రేక్’ ఫాస్ట్(CM Breakfast )కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలంటే వెనుకడుగు వేసేవారన్నారు. ఆ పరిస్థితికి చరమ గీతం పాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు- మన బడి’ ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు.
ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి పోషకాలతో కూడిన అల్పాహారాన్నీ అందించనున్నదన్నారు. తర్వాత అనేక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు, పార్టీలు, కులాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఖమ్మం నగరాన్ని ఐదేళ్లలో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దామన్నారు. అనంతరం నగరంలోని పోలియో హోంలో శ్రీమిత్ర ఫౌండేషన్, ఎన్ఆర్ఐలు సమకూర్చిన కుట్టుమిషన్లను నగరానికి చెందిన పలువురు మహిళలకు అందించారు.
కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.