ఖమ్మం, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే రూ.147 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్‌వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పిన 48 గంటల్లోనే ఈ సమస్యను సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.
మున్నేరుకు కరకట్ట నిర్మిస్తే వాగుకు ఇరువైపులా ఇండ్లు నిర్మించుకున్న ప్రజలు ఆవాసాలను కోల్పోవాల్సి వస్తుందని, ఆర్సీసీ కాంక్రీట్‌వాల్ నిర్మిస్తే నష్టం వాటిల్లదని సీఎంకు వివరించి ఒప్పించారు. సోమవారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో మున్నేరుకు శాశ్వత పరిష్కారం లభించింది. మున్నేరుకు నాయుడుపేట వైపు 6 కిలోమీటర్లు, ఖమ్మం వైపు 5 కిలోమీటర్ల మేర ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రూ.140 కోట్లతో తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.