ఖమ్మం ఎడ్యుకేషన్/ఖమ్మం మామిళ్లగూడెం, ఫిబ్రవరి 24: సర్కార్ బడులు కార్పొరేట్ కలను సంతరించుకున్నాయని రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన పునఃప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి, సర్కారు బడులన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులందరూ మంచి వాతావరణంలో ఇష్టంగా చదువుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలను గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.
ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం మంత్రి పువ్వాడ ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ గౌతమ్, సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు