హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మమత మెడికల్ కాలేజీలో సీట్లను బ్లాక్‌చేసి దందా చేస్తున్నట్టు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు.
యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయని, అలాంటప్పుడు బ్లాక్‌చేసి దందా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒక సీటును బ్లాక్ చేసినట్టు నిరూపించినా తన కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని పేర్కొన్నారు. నిరూపించకపోతే రేవంత్‌రెడ్డి ముకు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను వెనకి తీసుకోకపోతే రేవంత్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.