ఖమ్మం: ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, సీఎం కేసీఆర్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay ) అన్నారు. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని చెప్పారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైతులు, వారి కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా తిరగబడక ముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని హితవు పలికారు. పండిన ప్రతి గింజను కొంటామని ప్రకటించినందుకుగాను ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉద్యమాన్ని నిర్మించడం టీఆర్ఎస్కు కష్టమేమీ కాదన్నారు. బీజేపీ అహంకారపు కొమ్ములు విరిచేవరకు ఉద్యమం సాగుతుందని చెప్పారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రైతులకు అండగా ఉన్న సీఎం కేసీఆర్.. మరోసారి అన్నదాతకు అభయహస్తం అందించారని, యాసంగి ధాన్యమంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని భరోసాను కల్పించారని వెల్లడించారు. రూ. 1960 మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనడమే కాకుండా వీలైనంత తొందరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్ర భుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని, వరి వేయాలని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు పత్తా లేకుండాపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఓట్ల రాజకీయాలను అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.