హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం టోల్‌ట్యాక్స్ పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. దీనివల్ల సామాన్యుల బస్సు ప్రయాణం భారంగా మారటమే కాకుండా నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రశాంత్‌రెడ్డి బుధవారం కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బహిరంగ లేఖ రాశారు.
ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులకు సంబంధించిన 32 టోల్ గేట్ల వద్ద టోల్ట్యాక్స్లు పెంచుతున్నట్టు తమకు సమాచారం అందిందని, ఇప్పటికే టోల్‌ట్యాక్స్ భారంతో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నందున మరింత భారం మోపవద్దని లేఖలో కోరారు. 2014లో తెలంగాణవ్యాప్తంగా రూ.600 కోట్లు టోల్ వసూలు చేయగా, ప్రతి ఏడాది పెంపుతో అది 2023లో రూ.1824 కోట్లకు పెరిగిందని తెలిపారు. గడచిన తొమ్మిదేండ్ల టోల్‌టాక్స్ వసూళ్లు 300 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో మధ్యతరగతి ప్రజల జీవనం మరింత భారంగా మారుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
Tol
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి….
తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నాయకులు తరుచూ కేంద్రం జాతీయ రహదారుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం మంజూరీలు కాగితాల మీద కొండంత ఉంటే..ఖర్చు చేసింది మాత్రం గోరంతనే అని చెప్పారు. 2014 నుంచి నేటి వరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 113 NH ప్రాజెక్టులు, CRIF పనులకుగాను మొత్తం కలిపి రూ.1,25,176 కోట్లు మంజూరు చేసినట్టు కాగితాల మీద చూపిస్తున్నా.. ఖర్చు చేసింది మాత్ర కేవలం రూ.20,350 కోట్లు మాత్రమేనని వెల్లడించారు.
తెలంగాణలో జాతీయ రహదారుల కోసం కేంద్రం తొమ్మిదేండ్లలో రూ.20,350 కోట్లు ఖర్చుచేయగా, గడచిన తొమ్మిదేండ్లలో టోల్ ద్వారా తొమ్మిది వేల కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో తెలంగాణ ప్రజల నుంచి ఇప్పటికే సగం డబ్బులు టోల్‌టాక్స్ ద్వారా ముకుపిండి వసూలు చేశారని తేల్చిచెప్పారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంతో పాటు అదనపు రోడ్ సెస్సుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి గడచిన తొమ్మిదేండ్లలో కేంద్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఆ డబ్బు ఎటు పోతున్నదో తెలంగాణ ప్రజలకు లెక చెప్పాల్సిన అవసరమున్నదని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
అబద్ధాలు చెప్పే మీ నేతలకు చెప్పండి
కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల కోసం తెలంగాణలో లక్షల కోట్లు ఖర్చు చేసిందని పదేపదే అబద్దాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ వాస్తవ విషయాలు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ద్వారా మీరు తెలియజేస్తే మంచిదని మంత్రి వేముల గడ్కరీని కోరారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజల్లోకి బలవంతంగా జొప్పిస్తున్న అబద్ధాలు, అసత్యపు ప్రసంగాలు మానుకోవాలని సూచించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉన్నదని పేర్కొన్నారు. టోల్‌టాక్స్ పెంచుతూ, పెట్రోల్ డీజిల్‌పై సెస్‌లు వసూలు చేస్తూ సామాన్యులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.