బాల్కొండ, జూన్ 1 : కేసీఆర్ లేకపోతే తెలంగాణను యూపీ, బీహార్‌లా మారుస్తారని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. పచ్చబడ్డ తెలంగాణను బీజేపీ నాయకులు ఆగం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపారని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఆగమవుతుందన్నారు. రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఎన్నటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, బోదేపల్లి, జలాల్పూర్, కిసాన్‌నగర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 500 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు బుధవారం బాల్కొండలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే కరెంట్ కోతలున్నాయని.. మన రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నారని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ నల్లా నీరు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ వంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఎనిమిదేండ్లలో ప్రధాని మోదీ ఎందుకు చేయలేదని అడిగారు.
నేను 53 మందిరాలను కట్టించిన..
జై శ్రీరాం అని మాటలు చెప్పడం కాదని.. తాను కేసీఆర్‌ను ఒప్పించి 53 మందిరాలను కట్టించానని, ఎంపీ అర్వింద్ ఎన్ని కట్టించాడని మంత్రి వేముల ప్రశ్నించారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ఇందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూం ఇంటికి రూ.5.04 లక్షలు ఖర్చు చేస్తున్నామని, స్థలం ఖర్చు అదనమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులవన్నీ ఝూఠా మాటలని, ఇక నుంచి వారిని నిలదీయాలని, ఇష్టమొచ్చినట్టు కుక్కల్లాగా మొరిగే వాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడ అమలు చేసే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించమని గల్లా పట్టి అడగాలన్నారు. సోషల్ మీడియాలో చేసే అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రి వేముల చెప్పారు.