TGSRTC | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? కార్మిక సంఘాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ఒక వర్గం ముందు చెప్పినట్టుగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్ భవన్ వర కూ భారీ కవాతు నిర్వహించింది. మరో వర్గం మం త్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల కోసం, వారి సమస్యల కోసం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ డం కోసం, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించడం కోసం పోరాడే వారిని కాదని.. సమ్మెలో మొదట్నుంచి కలిసిరాని వారితో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలకు వెళ్లడం ఏంటనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేస్తున్నది. విభజించు, పాలించు ద్వారా ప్రభుత్వమే స్వయంగా సమ్మె నిర్వీర్యానికి పూనుకున్నట్టు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ సమ్మెపై ఇంటెలిజెన్స్ నిఘా
కొన్ని కార్మిక వర్గాలను అనుకూలంగా మార్చుకోవడంతో సమ్మె దాదాపు 50 శాతం నిర్వీర్యమైనట్టేనని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి తోడు ఏ స్థాయిలో సమ్మె జరగబోతున్నదోనని ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. సమ్మెకు వచ్చిన వారిని తొలగిస్తామని ముందుగానే బెదిరిస్తే మరింత మంది సమ్మెకు రాకుండా ఉంటారనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న సంఘాలు సమ్మె కు వెళ్లినా ప్రభుత్వం ఆశించినంత ప్రభావం ఉండబోదని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందట. దీంతో, సమస్యలపై చర్చించేందుకు ఇటు ఆర్టీసీ యాజమాన్యం, అటు ప్రభుత్వం కూడా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. కార్మిక సంఘాల జేఏసీ నేతల ప్రధాన డిమాండ్ యూనియన్లను పునరుద్ధరించడం. ఇది చేస్తే ప్రతిదానికి సంఘాల నుంచి ప్రతిఘటన తప్పదనే ధోరణిలో యాజమాన్యం ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ సమ్మెకు ఎలాంటి సంబంధం లేకపోయినా ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు సమస్యలు పరిష్కరించడం చేతగాక.. ఆ నెపాన్ని కూడా బీఆర్ఎస్ మీద నెట్టేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నట్టు తెలిసింది.
మంత్రితో చర్చల సారాంశం ఇదీ..
ఆర్టీసీ జేఏసీ చైర్మన్ టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘ్ జనరల్ సెక్రటరీ ఎర్ర స్వామికుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రటరీ పున్న హరికృష్ణ, పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు కలిసి సమస్యలను మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఆర్టీసీ సమస్యలపై ఎప్పుడైనా నన్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటా. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను, మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్న. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిషారానికి చొరవ తీసుకుంటా.
ఆర్టీసీకి 16 నెలలుగా ఎంతో మంచిచేశాం. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. గత పదేండ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. 2017 పే సేల్ 21 శాతం ఇచ్చింది మేమే. సంవత్సరానికి రూ.412 కోట్లు భారం పడుతున్నా ఇస్తున్నాం. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.1,039 కోట్లు చెల్లించాం. నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ.345 కోట్లు చెల్లించాం. 3,038 మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేయడానికి అనుమతి తీసుకున్నాం’ అని చెప్పారు. అయితే. ఆర్టీసీలో ప్రభుత్వ విలీనం.. ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణ, 2021 పీఆర్సీ ఎరియర్స్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిసింది.