హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): మహిళ అన్నిరంగాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని, అప్పుడే అభివృద్ధి చెందిన సమసమాజం ఏర్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో (ఐఫియా), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత ఇంకా పరిపూర్ణం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళాభివృద్ధి మరింతగా జరగాలంటే మహిళలందరూ విద్యావంతులు కావాలని సూచించారు. రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలని ఆంకాంక్షించారు.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించినట్టు చెప్పారు. సదస్సులో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ప్రొఫెసర్ వై ప్రశాంతి, ఐఫియా అధ్యక్షుడు సుధీర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నబ్‌కుమార్ కర్మకార్, సలహాదారు కే సుబ్బారెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన్య కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, స్టాన్లీ కళాశాలల చైర్మన్ కే కృష్ణారెడ్డి, వివిధ రాష్ట్రల ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ హాస్టళ్ల మెస్, భవనాల అద్దె, కరెంటు బిల్లులను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. విదేశీ విద్యా స్కాలర్‌షిప్పులను అర్హులందరికీ ఇవ్వాలని కోరారు.