హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికివారే మంత్రి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. చివరకు అసలు మంత్రులు కూడా ఇతర ఎమ్మెల్యేల ను వీరిని మంత్రులుగా భావించండి అంటూ అధికారులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆర్టీసీ అధికారుల సమక్షంలో సాగిన ఎపిసోడ్ ఇందుకు తాజా ఉదాహరణ. రాజగోపాల్‌రెడ్డి రెండు రోజుల క్రితం తన నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి చెప్పిన అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచిస్తూ, ‘రాజగోపాల్‌రెడ్డిని మంత్రి అని అనుకొనే పని చేయండి..’ అని పొన్నం వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘నన్ను అన్న మంత్రి అన్నడంటే.. నేను మంత్రినే’ అని చెప్పారు. దీంతో అక్కడ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై చర్చ జరిగింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందనేది రాజగోపాల్‌రెడ్డి ఆశ.