కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 21: రాష్ట్రంలో వరి నాట్లు వేసుకుని… యూరియా కోసం రైతులు ఆరాటపడుతున్నరు. సొసైటీ, పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుకాస్తున్నరు. కొన్నిచోట్ల ఒక్కో రైతుకు ఒక్కటే సంచి ఇస్తుంటే.. మరికొన్నిచోట్ల అది కూడా దొరక్క రైతులు ఉట్టిచేతులతో ఇంటిబాట పడుతున్నారు. యూరియా లోడు ఎప్పుడు వస్తుందో తెలియక… తెల్లవారుజాము నుంచే నిద్రాహారాలు మానుకుని నిరీక్షిస్తున్నారు. గంటల తరబడి నిలబడలేక, వర్షంలో తడుస్తూ నిరీక్షించలేక… వయసు సహకరించని రైతులు.. క్యూలో పాస్‌పుస్తకాలు పెడుతున్నారు. ఇదంతా కొందరు ప్రభుత్వ పెద్దలకు సహించడంలేదు.
బాధను భరించలేక రైతులు బజారెక్కితే… అమాత్యులు తమ కిరీటాలు నేలకూలినట్టు అవమానంగా భావిస్తున్నారు. ఆందోళనలు కేవలం కొన్ని పత్రికలు, టీవీలు సృష్టిగా అభివర్ణిస్తున్నారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ‘బీఆర్ఎస్ నాయకులు కొంత మంది జమై.. యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టి.. రైతుల్లో ఆందోళన కలిగిస్తూ.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు’ అని ఆరోపించారు. సర్కారును బదనాం చేయడమే లక్ష్యంగా… ప్రత్యేక ఎజెండా పెట్టుకొని ‘నమస్తే తెలంగాణ’ క్యూలైన్లో చెప్పులు పెట్టిన ఫొటోలు ప్రచురిస్తూ వార్తలు రాస్తుండగా, టీన్యూస్ ఆ దృశ్యాలు చూపించి రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నదని విమర్శించారు.
గురువారం కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టంచేశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రులు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరును జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ ప్రత్యేక ఎజెండా పెట్టుకొని ఇదంతా చేస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లే చెప్పులు పెట్టి, ఫొటోలు తీసిన ఘటనలు ఉన్నాయని చెప్పారు.
‘అంటే.. రాష్ట్రంలో యూరియా కొరత లేదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. కొరత ఉన్న మాట వాస్తవమేనని, కేంద్రం నుంచి రావాల్సిన యూరియాలో 60 శాతమే వచ్చిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రావాల్సినంత యూరియా రాకపోవడం వల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మానవత్వంతో తెలంగాణ రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయాలని కోరారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని తెలిపారు. కాబట్టి బండి సంజయ్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు.