హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఆటో చార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం అధ్యక్షతన ఆటో యూనియన్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిషారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగుల అధ్యక్షులు కౌషల్ సమీర్, కేకేసీ ఆటో విభాగం అధ్యక్షుడు మల్లేశ్, ఐఎన్టీయూసీ ప్రతినిధి మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.