Runa Mafi | పరకాల, ఆగస్టు 18 : అధికారంలో కి రాగానే ఒకేసారి 2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రుణరైతులు 70లక్షల మంది ఉంటే.. మూడు విడతల్లో కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ వర్తింపజేసి వందశాతం పూర్తిశామని చేతులు దులుపుకొన్నది. కేవలం 40శాతం మందికే రుణమాఫీ వర్తించగా, ఇంకా మాఫీ కాని లక్షలాది రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవడం, ఇటు రైతులు కోపంతో రోడ్డెక్కి నిరసనలకు దిగడంతో వారిని శాంతపరిచేందుకు ఓ మంత్రివర్యులు తాజాగా మరో ప్రకటన చేశారు.
త్వరలో రుణమాఫీ కోసం అదనంగా మరో 12 వేల కోట్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ భవనంలో అభివృద్ధి పనులు, డిగ్రీ కళాశాలకు ఆదివారం శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే రుణమాఫీకి రూ.19 వేల కోట్లు మంజూరు చేశామని, అదనపు నిధు లు త్వరలో మంజూరు చేసి అర్హులందరికీ రుణమాఫీ వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అరకొరే రుణమాఫీ అయిందన్న విషయం పొంగులేటి ప్రకటనతో తేటతెల్లమైందని విపక్షాలు స్పష్టంచేస్తున్నాయి.