హైదరాబాద్, ఆగస్ట్ 19 (నమస్తే తెలంగాణ): రైతులు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.
నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక సమస్యలు ఎదురొంటున్నారని చెప్పా రు. కొత్త చట్టం వీటికి పరిష్కారం చూపుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి కనీసం ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇతర శాఖలకు బదలాయించిన వీఆర్వోలను, వీఆర్ఏలను రెవెన్యూలోకి తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నామని తెలిపారు. ధరణి కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచిన అంశాలను వాటి ప్రత్యేకతలను రైతులకు, పట్టేదార్లకు చేకూరే ప్రయోజనాలను వివరించారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు కే చంద్రమోహన్ తదితరులు మాట్లాడారు.