హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలు, లబ్ధిదారుల ఎంపిక కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీ వేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్తులను 30లోగా డాటా ఎంట్రీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సీఎం అధ్యక్షతన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. సీఎస్ శాంతికుమారి దరఖాస్తులు, డాటా ఎంట్రీ వివరాలను సీఎంకు తెలిపారు.
సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 13శాతం ఎంట్రీ పూర్తయిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటితో ఏర్పాటుచేసిన కమిటీ లబ్ధిదారుల ఎంపిక, మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు కూడా ఉంటారని చెప్పారు. కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను క్యాబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.