Ponguleti Srinivas Reddy | నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 21 ( నమస్తే తెలంగాణ ) : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల అకారణంగా కరీంనగర్ కలెక్టర్‌పై సీరియస్ అయిన మంత్రి.. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై అదే రేతిలో మాట్లాడటంతో రెవెన్యూ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. సోమవారం నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో భాగంగా రైతులు తమ భూ సమస్యలపై మాట్లాడేందుకు అధికారులు మైక్ ఇచ్చారు. దీంతో ఒక రైతు తన భూమి సమస్యను మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై వెంటనే మంత్రి స్పందిస్తూ.. సదరు రైతు సమస్యకు సమాధానం చెప్పాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆ రైతు సమస్య తన దృష్టికి రాలేదని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆర్డీవో సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి పొంగులేటి ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇక్కడ ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నావు? ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నావు కదా? అతని సమస్య నీకెందుకు తెలవదు?
ఏం చేస్తున్నావు.. ఇన్ని రోజుల నుంచి? ఇంకెప్పుడు తెలుసుకుంటావు?’ అం టూ మంత్రి ఫైరయ్యారు. నిజానికి సదరు రైతు పేర్కొన్న సమస్య ఆర్డీవో స్థాయి అధికారి జవాబు చెప్పాల్సినది కాదని, మండల పరిధిలోని తహసీల్దార్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ, మంత్రి మాత్రం తహసీల్దార్‌ను కాకుండా ఆర్డీవోను సమాధానం చె ప్పాలని కోరడంపై రెవెన్యూ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విధుల్లో సమర్థుడైన అధికారిగా సదరు ఆర్డీవోకు పేరున్నట్టు రెవె న్యూ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంపై దేవరకొండ డివిజన్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ తండాల్లో ఉన్న గిరిజనులకు సైతం అర్థమయ్యేలా ఆర్డీవో రమణారెడ్డి చొరవ తీసుకుని పని చేస్తున్నారని అంటున్నారు. అధికారుల పనితీరు తెలుసుకోకుండానే ఇష్టానుసారంగా మాట్లాడటం మంత్రికి తగదని పలువురు వ్యాఖ్యానించారు. గతంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తిపై కూడా ఇలాగే అకారణంగా మంత్రి సీరియస్ అయ్యారని రెవెన్యూ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.