కూసుమంచి, సెప్టెంబర్ 23: పాలేరు కాల్వ మరమ్మతులో నిర్లక్ష్యం పనికిరాదని, యుద్ధప్రాతిపదికన రేయింబవళ్లు పనిచేసి సాధ్యమైనంత త్వరగా సాగుభూములకు నీరందించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ఖమ్మం జిల్లా పాలేరు కాల్వ మరమ్మతులు చేపట్టకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విలేకరుల సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన సాయంత్రమే మంత్రి పొంగులేటి స్పందించి, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం.
సోమవారం రాత్రి పాలేరు కాల్వకు పడిన గండి ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి అధికారులతో మాట్లాడారు. ‘జిల్లాలో రైతుల సాగు భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదలలో ఆలస్యం కావొద్దు.. మీరు ఎంత కష్టపడతారో తెలియదు. కానీ.. నీరు మాత్రం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ అర్ధరాత్రి ఇక్కడికి వస్తాను’ అని అధికారులకు తెలిపారు. పని ప్రదేశంలో విద్యుత్ లైట్లు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఆర్డీవో గణేశ్, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, బొర్రా రాజశేఖర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్, ఎస్ఈ నర్సింగరావు, ఈఈ అనన్య, డీఈ మధు, కాంట్రాక్టర్ ముత్తయ్య, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్ తదితరులు ఉన్నారు.