Minister Ponguleti | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒకరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి, రెండో విడతలో ఇంటి స్థలంతోపాటు ఇల్లును నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, వీఆర్వో వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నివాస స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేనివారి జాబితాను గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్లో 274 మంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, ఇతర విభాగాల నుంచి మరో 400 మందిని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
కొత్త వీఆర్వో వ్యవస్థ ఏర్పాటు కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి అర్హులను రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తామని వెల్లడించారు. ఈ మేరకు విధివిధానాలను వెంటనే రూపొందించి, పరీక్షకు ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని, మరో వెయ్యి మంది ఎంపికకు ప్రణాళిక తయారుచేయాలని సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎంఆర్వో డైరెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.