హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పెత్తనం కొనసాగించిన ఆంధ్రా నేతలకు ఇంకా తెలంగాణను దోచుకోవాలనే యావ చావలేదు. గతంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కొల్లగొట్టి.. అన్నిరంగాలను నిర్వీర్యం చేసిన నేతలు.. మరోసారి తమ నైజాన్ని చూపుతున్నారు. అందినకాడికి దోచుకునేందుకు గోతికాడి నక్కల్లా కాచుకు కూర్చున్నారు.
ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ దళితబంధు కార్యక్రమం అమలు తర్వాత.. టీఆర్ఎస్ పార్టీ స్థాపించాలని ప్రస్తుత ఏపీ నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామన్న ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేయాలన్నారు.
ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెట్టాలన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే.. భేషుగ్గా పోటీ చేయొచ్చని.. ఏపీ, తెలంగాణ సమైక్యంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారంటూ వ్యాఖ్యానించారు.