హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ కొనియాడారు. దేశ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందని ప్రశంసించారు. ఈ రెండు నగరాలకు తోడుగా ఉండాల్సిన తమిళనాడు గత పాలకుల వల్ల ఐటీలో వృద్ధి సాధించలేకపోయిందని చెప్పారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను తమిళనాడులోనూ అమలుచేస్తామని చెప్పారు. త్యాగరాజన్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఐటీ రంగంలో తెలంగాణ విధానాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ను సందర్శించింది. తొలుత ఈ బృందం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది.
రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని టీ-వర్క్స్, టీ-హబ్, వీ-హబ్, టీ-ఫైబర్ కార్యాలయాలను సందర్శించింది. అనంతరం ఐటీ కారిడార్‌లోని టెక్‌మహీంద్రా కార్యాలయంలో పలువురు ఐటీ పరిశ్రమల భాగస్వాములతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలను ఐటీ శాఖ అధికారులు తాగ్యరాజన్కు వివరించారు. అనంతరం త్యాగరాజన్ మాట్లాడుతూ.. తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ను సందర్శించినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు ఎంతో ఆధునికంగా ఉన్నాయని, ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని సమర్థంగా వినియోగించారని కొనియాడారు. ఇదే విధానాన్ని తమిళనాడు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఐటీ మంత్రి కేటీఆర్ తమను సాదరంగా ఆహ్వానించి, ఐటీ పరంగా ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారని, అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.