Congress | వరంగల్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాపాలనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలతోపాటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు నచ్చని కాంగ్రెస్ నాయకులపైనా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వచ్చిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వరంగల్ జిల్లా అధికార పార్టీలో మరోసారి చిచ్చురేపాయి. వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసిన మంత్రి కొండా సురేఖ అనుచరుడు బత్తిని అఖిల్‌పై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనుచరుడు పరమేశ్వర్ మూడు వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పరమేశ్వర్ గెలుపు సందర్భాన్ని వా ట్సాప్లో పోస్టు చేశారనే కారణంతో అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం అకారణంగా కాంగ్రెస్ కార్యకర్తలను అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారని ఎమ్మెల్సీ సారయ్య వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝాకు ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నిక ఫలితాలపై వాట్సాప్‌లో పోస్టు చేస్తే పోలీసులు కొట్టడం ఏమిటిని ప్రశ్నించారు. బాధితుడి పెండ్లి ఆదివారం ఉ న్నదని చెప్పినా వినకుండా అర్ధరాత్రి అకారణంగా కొ ట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు నెలల క్రితం వరంగల్‌లోని ఎల్బీనగర్లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టారని గుర్తచేశారు. వరంగల్ నగరంలో రౌడీలకు పోలీసు లు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.