Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడేమో నీళ్లు ఎత్తడం లేదని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ మాత్రం నీళ్లు ఇవ్మని చెబుతున్నాడని అన్నారు. మంత్రులది ఒక మాట.. కలెక్టర్‌ది ఒక మాట ఉంటుందా అని మండిపడ్డారు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా నీళ్లను కాపాడుకుంటే.. మీరు వృథా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాకాల ప్రాజెక్టు కింద 29వేల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి అక్కడి రైతులు నాట్లు వేసుకున్నారని, రామప్ప కింద కూడా నాట్లు వేసుకున్నారని పేర్కొన్నారు. రామప్ప కింద 5500 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. నిన్న పాకాల కింద తూములు మూసేశారని పేర్కొన్నారు. మంత్రులేమో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటారని.. వరంగల్ జిల్లా కలెక్టరేమో నీళ్లు ఇవ్వమని చెబుతున్నాడని అన్నారు. నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు.
మంత్రులది ఒక మాట.. కలెక్టర్‌ది ఒక మాట ఉంటుందా అని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా అని ప్రశ్నించారు. రామప్ప కింద తూములు మూసేస్తే రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. నీళ్లు ఎత్తకుండా కలెక్టర్ ఎందుకు తూములు మూసేయమని చెప్పాడని ప్రశ్నించారు. మంత్రులు చెప్పింది తప్పయితే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రాప్ హాలీడే ప్రకటించి, రైతులకు డబ్బులు ఇవ్వాలన్నారు. ఇది చిన్న పిల్లల ఆటనా? ప్రభుత్వం నడిపే పద్ధతి ఇదేనా అని నిలదీశారు.
పంటను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడతారని హరీశ్‌రావు తెలిపారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసి నార్లు కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. బిందెలు, సీసాలతో పత్తికి బొట్టు బొట్టు నీళ్లు జల్లుకుంటున్నారని చెప్పారు. రైతులకు ఉన్న తపన, సోయి రేవంత్ రెడ్డికి లేదా అని మండిపడ్డారు. నీళ్ల కోసం తెలంగాణ రైతులు ఎంతో తపన పడుతున్నారని తెలిపారు. నీళ్ల ఎత్తిపోతల విషయంలో కూడా వాయిదాలు ఎందుకు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేక నీళ్లు కిందకు విడిచిపెడుతున్నాడని మండిపడ్డారు.