Wanaparthy | వనపర్తి : వనపర్తి రాజ భవనానికి వందేండ్లకు పైబడిన చరిత్ర ఉందని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న ఈ రాజభవనాన్ని అత్యంత వైభవోపేతంగా పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని, ఇది వనపర్తి కీర్తి కిరీటం అని మంత్రి పేర్కొన్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్‌లో వనపర్తి రాజభవనాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 24 ఎకరాల ప్రాంగణాన్ని గతంలో కళాశాలకు కేటాయించారని గుర్తు చేశారు. అయితే కాలక్రమంలో సరైన నిర్వహణ లేక ఈ రాజభవనం కొంత దెబ్బతిన్నది. చారిత్రక భవనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. వనపర్తి వాసుల ఆకాంక్ష మేరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు.
కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.22 కోట్లు కేటాయించారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి కేటాయించినందుకు వనపర్తి ప్రజల తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతన్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో భవనాన్ని పునరుద్దరించి వినియోగంలోకి తీసుకువస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి నియోజకవర్గంలోని వివిధ రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయని మంత్రి తెలిపారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ ఇంతలా నియోజకవర్గానికి నిధులు విడుదలైన దాఖలాలు లేవు. ప్రజలు ఆశించిన, ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని పేర్కొన్నారు.