హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ క్రమశిక్షణను పాటించకుండా, హద్దుమీరి ప్రవర్తిస్తున్నందునే వారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలో పార్టీనే అంతిమమని, వ్యక్తులు కాదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తనను తిట్టినోళ్లను కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే జూపల్లి, పొంగులేటి వస్తామంటే పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. వీరిద్దరూ పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అన్నట్టు వ్యవహరిస్తున్నారని, చివరకు పార్టీ అధినేత మీదనే మాట్లాడే స్థాయికి పోయారని చెప్పారు.
బలిదానాలకు మీరు బాధ్యులు కాదా?
అమరవీరుల గురించి మాట్లాడే నైతికత జూపల్లి కృష్ణారావుకు ఉన్నదా? అని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైతే 2012లో జూపల్లి టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా బలిదానాల గురించి కృష్ణారావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లోకి వస్తానంటే కేసీఆర్ స్వాగతించారని, 2014లో సిట్టింగ్ స్థానం కేటాయించి, గెలిపించి మంత్రిగా గౌరవించారని గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఆయన మాత్రమే ఎందుకు ఓడిపోయారో జూపల్లి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఓడిపోయిన మరుక్షణం నుంచే ఏదో రకమైన అసహనాన్ని వెళ్లగక్కడం, పార్టీ మీద ఏదో ఒక నిందను మోపే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ పార్టీ సహనంతో వ్యవహరించిందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మాట్లాడారని చెప్పారు. జూపల్లి వైఖరిలో పదవీకాంక్షే తప్ప, ప్రజాప్రయోజనం ఏమున్నదని ప్రశ్నించారు. జూపల్లి, పొంగులేటి మాటల్లో కొత్తదేమీ లేదని.. పాత క్యాసెట్టునే మళ్లీ రిపీట్ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌పై ఇదే అభిప్రాయం ఉంటే ఆయన మంత్రివర్గంలో జూపల్లి ఎలా పనిచేశారని నిలదీశారు.
జూపల్లి, పొంగులేటివి పగటి కలలే
బీఆర్ఎస్ని, పార్టీ అధినేత కేసీఆర్‌ను బలహీనపర్చాలని చూస్తే అది పగటి కలగానే మిగిలిపోతుందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కొంతకాలంగా పొంగులేటి, జూపల్లి ఎవరి ట్రాప్‌లో ఉన్నారో అందరికీ తెలుసున్నారు. నాలుగు రోజులు పోతే అందరి బండారం బయట పడుతుందని చెప్పారు. కేసీఆర్ తన ప్రస్థానంలో ఇటువంటివి ఎన్నో చూశారని, ఆయనను వీడి బయటికి వెళ్లి విజయవంతంగా నిలబడిన వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించిన ఎందరో రాజకీయంగా కాలగర్భంలో కలిపోయారని, జూపల్లి, పొంగులేటి పరిస్థితి కూడా అదేనని స్పష్టంచేశారు.
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. పెట్టుబడులు, సాగునీరు, కరెంటు, సంక్షేమ రంగాల కోసం అప్పులు చేయాల్సిన అవసరం రాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో ఒక్క సాగునీటి రంగంపైనే రూ.4.5 లక్షల కోట్ల వెచ్చించారని గుర్తు చేశారు. సమైక్య పాలనలో సాధ్యం కాలేదని, కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నామని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే అది కూడా కేసీఆర్ తప్పేనా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, మీరు ఎప్పుడు వచ్చినా కేసీఆర్, కేటీఆర్ కాదనలేదని గుర్తుచేశారు. రెండురోజుల క్రితమే కేటీఆర్‌తో జూపల్లి మాట్లాడారని, కానీ మళ్లీ ఫోన్లు కూడా ఎత్తరని మాట్లాడటం ఎందుకని నిలదీశారు. ఇది రాజకీయ దిగజారుడు కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
జూరాలకు నీళ్లు రాని పాపం జూపల్లిది కాదా?
ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధుల ఫోన్లే ఎత్తరని జూపల్లి, పొంగులేటి మాట్లాడుతున్నారని, కానీ తాము అసలు ప్రజాప్రతినిధులమే కాదన్న విషయాన్ని వారిద్దరూ మర్చిపోయారని నిరంజన్‌రెడ్డి చురకలేశారు. ఏ ప్రజాప్రతినిధి తరఫున వారు మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దేశంలో కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి లేరు. అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నది. అద్భుతంగా సాగునీటి కల్పన జరిగింది. కేసీఆర్ పాలనలో వేగంగా ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. కేసీఆర్ విజన్‌తో పేదరికాన్ని పోగొడుతున్నారు. పాలమూరును పచ్చదనంతో నింపేస్తున్నాం’ అంటూ తాను మాట్లాడిన మాటలు జూపల్లికి గుర్తులేవా? అని ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసి జిల్లాకు నీళ్లొస్తలేవని, ఈ పాపమంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూపల్లి అనడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. సమైక్య పాలనలో నీళ్లొచ్చాయని చెప్పడానికి సిగ్గుండాలని చురకలేశారు. జూరాలకు నీళ్లు రాని పాపం సమైక్య ప్రభుత్వాల్లో పనిచేసిన మీది కాదా? అని నిలదీశారు.
తెలంగాణ తల్లి విగ్రహం పెడితే కేసులు పెట్టలేదా?
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి రాజీనామా చేస్తానని జూపల్లి కృష్ణారావు ప్రకటించారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సందర్భంలో తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని చెప్పలేదు కానీ, జగన్ కోసమైతే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాడని, జూపల్లికి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధికి ఇంత కంటే నిదర్శనం ఇంకేమి ఉంటుందని ప్రశ్నించారు. జూపల్లి, పొంగులేటి తెలంగాణ గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జూపల్లి మంత్రిగా పనిచేసేటప్పుడు కూడా ఇంట్లో వైఎస్ ఫొటో ఉండేడదని, తనను గౌరవించి మంత్రిని చేసిన కేసీఆర్ ఫొటో మాత్రం లేదని పేర్కొన్నారు. అటువంటి జూపల్లి ఓ తెలంగాణ వాదిలా.. పైగా చిత్తశుద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయాంలో జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలోనే తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించారని గుర్తుచేశారు. ప్రతిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు పెట్టించారన్నారు. ఆనాడు ఒక్క తెలంగాణ తల్లి విగ్రహమైనా పెట్టించావా? అని ప్రశ్నించారు. ఇవన్నీ మరిచిపోయి అకస్మాత్తుగా తెలంగాణపై ఎక్కడలేని ప్రేమను చూపిస్తే సమాజం నమ్మదని చెప్పారు.
పొంగులేటి.. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ?
2014 వరకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్తో లేనేలేరని, ఆ సమయంలో ఆయన ఎక్కడున్నారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పొంగులేటి కూడా ఉద్యమ ఆకాంక్ష, అమరవీరులు అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. పొంగులేటికి పార్టీలో తగు ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన అడిగిన పనులు చేశారని, అభివృద్ధి కోసం ఏమడిగినా కాదనలేదని చెప్పారు. ఆ తర్వాత పొంగులేటికి ఎందుకు అవకాశం రాలేదో ఆయనకు, పార్టీకి తెలుసునన్నారు. అవి బహిరంగ చర్చకు పెట్టి, ఆయన పరువును మరింత పలుచన చేయడం ఇష్టం లేదని చెప్పారు. తనకు న్యాయం జరగలేదని భావిస్తే, ఈ ఏడాది సాధారణ ఎన్నికల వరకు వేచిచూస్తే బాగుండేదని చెప్పారు. ఇవన్నీ విస్మరించి ఎంతదూరమైనా వెళ్తామంటే సహించేది లేదన్నారు.