Niranjan Reddy | హైదరాబాద్ : తెలంగాణలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా కొరత ఉందంటూ.. కావాలనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ప్యాక్స్), 16,615 అధీకృత డీలర్ల ద్వారా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా కృత్రిమ కొరతను సృష్టించి రాష్ట్రం మొత్తం కూడా యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పూర్తిగా దురుద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యవహారమని అన్నారు. నల్గొండలో కృత్రిమ కొరతపై సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ వానాకాలం సీజన్ కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులకు మరింత ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేందుకు గానూ శుక్రవారం 15,838 టన్నుల యూరియాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీ విజయ్ కుమార్, జేడీ (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.