హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రైతులకు వ్యవసాయంలో కచ్చితమైన, ఆచరణాత్మకమైన, స్థిరమైన పరిష్కారాలను అందజేయడమే ‘కన్హా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ అగ్రికల్చర్’ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హార్ట్ఫుల్నెస్ సంస్థ ‘సుమన్నతీ ఫౌండేషన్ ’ వనశాంతి ఎఫ్పీసీ సహకారంతో కన్హా శాంతివనంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అగ్రికల్చర్‌కి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడులు, మౌలిక సదుపాయాలు, మెరుగైన వ్యవసాయ ప్రక్రియల కోసం హార్ట్‌ఫుల్ నెస్ సంస్థ సహకారం అందిస్తుందని చెప్పారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, ఉత్పత్తుల విక్రయాలు వంటి అంశాల్లో కొత్త ఒరవడి సృష్టించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ మార్గదర్శి దాజీ, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.