హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్న అంచనాతో ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని, కంది సాగును మరింత ప్రోత్సహించాలని సూచించారు. ఈ సీజన్‌కు అవసరమైన 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, పచ్చిరొట్ట సాగుతోపాటు నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల కోసం రూ.76.66 కోట్ల సబ్సిడీని ప్రకటించిందని గుర్తుచేశారు. సాగులో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలన్నారు.
వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం
ఆయిల్‌పాం సాగులో అంతర పంటల సాగు కోసం రైతులకు డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేల వరకు పంట రుణాలు అందించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. ఇకపై మార్చి చివరి నాటికల్లా యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వడగండ్ల వానల నుంచి పంటలను కాపాడుకోవచ్చని అన్నారు. తకువ కాలంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వరి వంగడాలను రైతులకు అందించాలని చెప్పారు. వానకాలం సీజన్లో వరి సాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, జిల్లాలవారీగా అవసరాన్ని బట్టి పంపిణీ చేయాలని, నకిలీ విత్తన పంపిణీదారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కొండబాల కోటేశ్వర్రావు, గంగారెడ్డి, కొండూరు రవీందర్రావు, మచ్చా శ్రీనివాస్‌రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, రాజావరప్రసాద్రావు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి అవగాహన సమావేశాలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వానకాలం సాగుపై ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. రైతు వేదికల్లో సమస్యలను పరిష్కరించాలని, వాటికి మెయింటనెన్స్ అలవెన్స్ కూడా ఇవ్వాలని సూచించారు. పంటల ఉత్పాదకతలో ప్రపంచ సగటును మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది కూడా పంటల సాగులో తెలంగాణ మరో చరిత్ర సృష్టించేలా, కొత్త రికార్డులను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.