హైదరాబాద్: రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు. వేలాది మంది బలిదానాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ యాస, భాషను అవమానించిందన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనభాపక్ష కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నామని.. కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ నాయకుల్లో తెలంగాణ ఇచ్చామనే మాటల్లోనే అహంకారం కనిపిస్తుందన్నారు.
తెలంగాణలో ఏ పరిణామం జరగాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కితేనే కాంగ్రెస్‌లో నడుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాత్రమే ఒక ఆత్మని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పుడు టీడీపీలో ఉన్నకేసీఆర్.. చంద్రబాబుని ఎదిరించారని తెలిపారు. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలపై పోరాటం మరింత ఉధృతమయ్యిందని తెలిపారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేకుండా సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కరెంట్‌ను పట్టుకుని షాక్‌కు గురైందని చెప్పారు. ఆ పార్టీ దేశంలో విద్యుత్‌పై ఒక విధానమంటూ లేదని విమర్శించారు. తొందరపాటులో అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లు ఉందని అన్నారు. ఆ పార్టీలో నాయకుడికో విధానం ఉంటుందని ఎద్దేవాచేశారు.