Minister Niranjan Reddy | తెలంగాణ (Telangana) ప్రజలకు అన్నం తినడం అలవాటు చేసింది నేనేనంటూ తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని, అహంకారానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రులకు జొన్నలే ఆహారమని మహాకవి శ్రీనాథుడు ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాసిన పద్యాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు పండించే వారని, వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి అని గుర్తు చేశారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని తెలిపారు.
15వ శతాబ్దం నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి అని తెలిపారు. 1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలోని చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులను పక్కనపెట్టి వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారని, ఆఖరుకు రూ.2 కిలో బియ్యం కోసం తమ ఓటు హకును వినియోగించుకునే దుస్థితికి తెలంగాణ ప్రజలను తీసుకువచ్చారని విమర్శించారు.