హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ రైతులకు ఇచ్చినవన్నీ ఝూటా హామీలేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో హితవు పలికారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామం టూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.. రైతుల ఆదా యం ఎక్కడ రెట్టింపు అయిందో చూపించాలని డిమాండ్ చేశారు. 60 ఏండ్లు దాటిన రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కేంద్రం విధానాలు, నినాదాలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
ఉద్యానంలో తెలంగాణ మేటీ
ఉద్యాన పంటల్లో తెలంగాణ మేటిగా నిలిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పలు పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశ సగటును మించిందని తెలిపారు. మామిడి ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 8.17 మెట్రిక్ టన్నులు కాగా తెలంగాణ సగటు 9.24 మెట్రిక్ టన్నులు ఉన్నదన్నారు. మిరప ఉత్పాదకత జాతీయ సగటు 3.77 మెట్రిక్ టన్నులు కాగా తెలంగాణ సగటు 5.67 మెట్రి క్ టన్నులుగా ఉన్నదని వెల్లడించారు.
86 వేల ఎకరాల్లో పసుపు సాగులో దేశంలో రెండో స్థానంలో ఉండగా ఉత్పత్తిలో 2.2 లక్షల టన్నులతో 5వ స్థానంలో నిలిచిందని తెలిపా రు. కూరగాయల ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 18.79 మెట్రిక్ టన్నులు కాగా తెలంగాణ సగటు 24.77 మెట్రిక్ టన్నులుగా ఉన్నదని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ.. ఈ ఏడాది చివరి వరకు విస్తీర్ణంలో దేశంలో అగ్రస్థానానికి చేరుకోనున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలైన రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, ఉచిత కరెంటు, సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ, సాగుకు ప్రోత్సాహంతో అద్భుతాలు సాధిస్తున్నట్టు చెప్పారు. పంట ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని కోహెడలో అత్యాధునిక వసతులతో 200 ఎకరాల్లో మార్కెట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు.