హైదరాబాద్ : తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు సిగ్గు, శరం లేని రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు అవివేకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు పోయి కొనుగోలు చేయాలని అంటున్నాడు. ఇది బండి సంజయ్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
బీజేపీ నాయకులు ఆటోలో కర్రలు, రాడ్లు తీసుకెళ్లి రైతులపై దాడి చేసేందుకు యత్నించారు. తెలంగాణ ప్రభుత్వం వానాకాలం పంట కొంటుంది. యాసంగి వడ్లపై సమాధానం చెప్పండి అని రైతులు కూడా బీజేపీ నాయకులను నిలదీస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి వరి ధాన్యాన్ని ఇష్టమొచ్చినట్లు తొక్కి, విధ్వంసం సృష్టించారు. తెలంగాణ రైతాంగం కష్టపడి ధాన్యం పండించారు. రైతు కష్టంలో కానీ రైతు పథకాల్లో కానీ బీజేపీ పాత్ర లేదు. నీళ్ల విషయంలోనూ బీజేపీ నాయకులు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు.
రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న రైతు లోకాన్ని మీ మూర్ఖపు చర్యలతో ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులు సంతోషంగా ఉంటే బీజేపీకి నచ్చడం లేదు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి యాసంగి వడ్లు కొంటామని ప్రకటన చేయించాలన్నారు. రైతుల ఉసురు తీసుకుంటున్నారు. బీజేపీ పక్కా బిజినెస్, కార్పొరేట్ పార్టీ అని నిరంజన్ రెడ్డి విమర్శించారు.