వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పెబ్బేరు రహదారిలో సింజెంటా కంపెనీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన వే సైడ్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
భవిష్యత్ లో ప్రపంచానికి భారతదేశం ఆహారం పెట్టే స్థాయికి ఎదుగుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) సహకారంతో వనపర్తిలో మహిళా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వనపర్తి లో ప్రారంభించిన వేసైడ్ మార్కెట్(wayside market) వల్ల రైతులకు ఎంతో ఉపయోగమని అన్నారు.
వినియోగదారుల సౌకర్యం కోసం టాయిలెట్లు, ఆయాలు, ఆటస్థలాలు, లాన్, పార్కింగ్ ఈ మార్కెట్లో సింజెంటా కంపెనీ రూ.3.40 కోట్లతో నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తిలో వ్యవసాయ కళాశాల భవన నిర్మాణం కోసం సింజెంటా కంపెనీ సహకారం అందించాలని కోరారు.ప్రపంచంలో నాణ్యమైన కూరగాయల విత్తనాలను అందించే కంపెనీల్లో సింజెంటా ప్రముఖమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింజెంటా గ్లోబల్ సీఈవో మిస్టర్ హెరిక్, భారతదేశ ప్రతినిధులు సుశీల్, ఫణీంద్ర పాల్గొన్నారు.