హైదరాబాద్: చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని పెంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు చేస్తున్న సేవలకుగాను చొప్పదండి ప్రాథమిక సహకార సంఘానికి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో అవార్డు రావడం అభినందనీయం అన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే సుంకె రవిచందర్‌తో కలిసి చొప్పదండి పాలకవర్గం సభ్యులు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి రైతులకు చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా ఉన్నదని, రైతులకు ఉత్తమసేవలు అందిస్తుందని అభినందించారు.
ఇతర సంఘాల్లో ఎక్కడా లేనివిధంగా సంఘం సభ్యులకు ప్రమాద బీమా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం హర్ష నీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రైతులకు మరిన్నీ సేవలందించి వచ్చే ఏడాది మొదటి స్థానంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేయాలని సూచించారు.
రైతులకు అందిస్తున్న సేవలకు గాను చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 2017-18లో మొదటిసారి, 2018-19లో రెండోసారి, 2019-20 సంవత్సరానికిగాను మూడోసారి ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీఓబీ అవార్డు లభించింది. దీనిని ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్‌లో ప్రదానం చేయనున్నారు.