మేడ్చల్ రూరల్, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్దిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి,మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy )అన్నారు. మేడ్చల్ మండలంలోని సోమారం, ఎల్లంపేట, సైదోనిగడ్డ తండా, రావల్కోల్ గ్రామాల్లో సోమవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ది అంటే తెలంగాణలోనే జరిగిందని, ఇతర రాష్ట్రాల వారు మన అభివృద్ధిని చూసి నేర్చుకునే విధంగా సీఎం కేసీఆర్ పని చేశారన్నారు.
తండాలు, పల్లెలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చడంతో అవి అభివృద్ది దిశలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మొద్దని, 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, ప్రజలను వంచించి సర్వనాశనం చేసిందని ఆరోపించారు. ఒక్క ఓటు వేసి తనను గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు ప్రజల సేవ చేసుకుంటూ ఉంటానని, అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ భాస్కర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.