మేడ్చల్, మే 30 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కుట్రలు, కుంతంత్రాలు, బ్లాక్ మెయిలింగ్ బయట పెడుతున్నందుకే తనపై దాడి చేయించాడని తెలిపారు. ఆదివారం రెడ్డి గర్జన సభలో కాంగ్రెస్ గుండాలతో రేవంత్‌రెడ్డి తనపై దాడి చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి దౌర్జ్యనానికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చేప్తారని పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్‌రెడ్డి చేసింది ఏమీ లేదని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే బ్లాక్ మెయిలింగ్ కోసమని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
తెలంగాణలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్సే
తెలంగాణలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. కాంగ్రెస్ నేతలకు అధికారం కలగానే మిగిలిపోతుందన్నారు. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అంతా టీఆర్ఎస్ వైపే ఉన్నదని తెలిపారు.
ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు
సిటీబ్యూరో/ఘట్కేసర్ రూరల్, మే 30(నమస్తే తెలంగాణ): మంత్రి మల్లారెడ్డిపై దాడికి యత్నించిన వారిపై పలువురు టీఆర్ఎస్ నేతలు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యా దు చేశారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్ అనురాధ రాఘవరెడ్డి, వెంకట్‌రెడ్డి, సాయిరెడ్డి, టీఆర్ఎస్ పోచారం మున్సిపాల్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, నాయకులు మచ్చేందర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి ఘట్కేసర్ సీఐ చంద్రబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్రెడ్డిల ప్రోద్భలంతోనే దాడికి యత్నించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు 143, 147, 149, 341, 352, 504, 506 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.సీసీ కెమెరాలను పరిశీలించాక దాడికి యత్నించిన వారిని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.