
రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని మానేరు నదిలో చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పరామర్శించారు. గణేశ్, వెంకటసాయి, రాకేశ్, క్రాంతి, అజయ్, మనోజ్ మృతి చెందగా.. వారి కుటుంబాలను కుటుంబాలను ఓదార్చి, సంతాపం ప్రకటించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.5లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
దుర్ఘటన జరిగిన ప్రమాదంలో హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్‌డామ్‌కు మరమ్మతులు, కట్టతెగిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పూడ్చేలా చూడాలని మున్సిపల్ చైర్మన్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, పిల్లల పట్ల తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉంటూ వారికి అవసరమైన జాగ్రత్తలు ఇవ్వాలని, గమనిస్తూ ఉండాలన్నారు.
సిరిసిల్లలోని మానేరు వాగులో గల్లంతయ్యి మరణించిన చిన్నారుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించి భవిష్యత్తులో అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. @KTRTRS pic.twitter.com/YUalV6CYqj
— Namasthe Telangana (@ntdailyonline) November 17, 2021