రాజన్న సిరిసిల్ల: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని ఆనాటి ప్రభుత్వం జలదృశ్యములో ఎక్కడ అవమానపరిచిందో అదే చోట బీఆర్ఎస్ ప్రభుత్వం బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి గౌరవించిందన్నారు. ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవ రోజున బాపూజీ పేరుమీద 50 మంది చేనేత కళాకారులకు పురస్కారాలతోపాటు రూ.25వేలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.