హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం కింద తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అర్బన్ పార్కులు ప్రకృతి నిలయాలుగా మారాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రకృతి మధ్య గడిపేందుకు అర్బన్ పార్కులు ఉత్తమ గమ్యస్థానాలుగా మారాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్కుల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్‌తో పాటు వివిధ రకాల పక్షులను చూడొచ్చని కేటీఆర్ తెలిపారు. ఇంకా వివిధ ఆటలతో ఎంజాయ్ చేయొచ్చు అని ఆయన పేర్కొన్నారు. అర్బన్ పార్కులకు సంబంధించిన యాప్ లింక్‌ను తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ షేర్ చేశారు.
Urban Parks created by #Telangana Govt under #HaritaHaaram are the best destinations to spend time amidst Nature
— KTR (@KTRTRS) January 21, 2022
Walking, Trekking, Bird watching & Cycling are few activities one can enjoy
https://t.co/Ee8geThc97
App👆Helps in Navigating to the nearest park around you pic.twitter.com/8OZ8FSD0Wc
నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని అటవీశాఖ అందుబాటులోకి తెచిన విషయం తెలిసిందే. ప్రకృతికి దగ్గరగా వెళ్లి ప్రశాంతత పొందాలనుకొనే పట్టణ వాసుల కోసం యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఇటీవలే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పార్క్‌ను ఒక్కో థీమ్‌తో అర్బన్ ఫారెస్ట్‌లుగా తీర్చిదిద్దామని చెప్పారు. హెచ్ఎండీఏ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్న 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని యాప్‌లో పొందుపరిచారు. రెండో దశలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని దీనిలో చేర్చనున్నారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ చొరవతో ఈ యాప్‌ను ‘పమ్టెన్-పీఏఎంటీఈఎన్’ సంస్థ రూపొందించింది. యాపిల్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో urban forest parks అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.