నల్లగొండ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హాలియా మున్సిపాలిటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో హాలియా మున్సిపాలిటీ లో అధికారులు ప్రజాప్రతినిధుల సుడిగాలి పర్యటన చేశారు.
హాలియాలో ఎడమ కాలువ వెంట నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్, డిజిటల్ లైబ్రరీ, వైకుంఠధామం కి వెళ్లే రహదారి, సాగర్ రోడ్లో మధారిగూడెం మేజర్ కాలువ ప్రవహించే ప్రాంతాన్ని పరిశీలించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
హాలియాలో వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం నందికొండ మున్సిపాలిటీలోనూ పర్యటించారు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్, హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ పార్వతమ్మ, కమిషనర్ వేమన రెడ్డి స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.