Minister KTR | తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం, దీన్ని ఎవరూ తెంచలేరు, తుంచలేరు. అధికారం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. అందర్నీ ఒప్పించి, మెప్పించి పరిపాలనతో కొత్త పుంతలు తొక్కుతూ దూసుకెళ్తున్నాం. చాయిస్ ప్రజల ముందు ఉన్నది. మేం చెప్పింది తప్పయితే, మేం చెప్పినదాంట్లో అవాస్తవాలుంటే మమ్మల్ని శిక్షించాలి. ఓడించాలి. మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్లు చెప్పింది తప్పయితే వాళ్లకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి. కాంగ్రెస్ అంటేనే అంధకారం. వాళ్లకు అధికారం ఇస్తే ప్రజలకు చీకటి రోజులే.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ లీజు విషయంలో తాము తప్పు చేశామని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము అడ్డగోలుగా టెండర్ ఇవ్వలేదని, నేషనల్ హైవేస్ సంస్థ ఏ నిబంధనలైతే పాటిస్తుందో వాటి ఆధారంగానే టెండర్లు పిలిచినట్టు తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ సదరు సంస్థ రోడ్లను లీజుకు తీసుకున్నదని, మరి అక్కడ కూడా కుంభకోణాలు జరిగినట్టేనా? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఒకవేళ టీవోటీ-ఓఆర్ఆర్ విషయంలో నేను తప్పు చేసినట్టు, మా ప్రభుత్వం తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఒక్క క్షణం ఇక్కడ ఉండను.
రాజకీయంలో మళ్లీ ఇంకో పదవి తీసుకోను. ఇంకో ఎన్నికలో పోటీ చేయను’ అని కుండబద్దలు కొట్టారు. తాము ఏ తప్పు చేయలేదని, తమకు చిత్తశుద్ధి ఉన్నదని తెలిపారు. రేవంత్‌రెడ్డిలా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అభూత కల్పన చేసే అవసరం తమకు లేదని విమర్శించారు. ఇక టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(టీవోటీ), బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానాలను తీసుకొచ్చిందే నాటి కేంద్రంలోని కాంగ్రెస్ అని తెలిపారు. ఈ విధానంలో వచ్చిన నిధులను ఇతర మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలని, దీన్ని కూడా తప్పంటే ఎలా? అని ప్రశ్నించారు. గుజరాత్లో అక్కడి పవర్లైన్స్ను కూడా ప్రైవేటుకు లీజుకిస్తారని వివరించారు. ఎన్హెచ్ఏఐలో ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరిగాయని, వాటి ఆధారంగానే తాము టీవోటీ ఇచ్చామని స్పష్టం చేశారు. ‘మేం ఏ తప్పూ చేయలేదు. జరగలేదు. ప్రజల ఆశీర్వాదంతోనే ఇక్కడున్నాం. వాళ్లు వద్దన్నప్పుడు ఇంటికి పోతాం తప్ప ఎలాంటి చిల్లర పనులు చేయం’ అని వెల్లడించారు. టెండర్ గడువు ముగియగానే సదరు ఆస్తి తిరిగి ప్రభుత్వానికే వస్తుందని, ఆస్తిని వదులుకోలేదని తెలిపారు.
కాంగ్రెస్ రాష్ర్టాల్లోనూ ఐఆర్బీకి లీజు
ఓఆర్ఆర్ లీజుకు తీసుకున్న ఐఆర్బీ సంస్థపై, ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఓఆర్ఆర్ టీవోటీలో పాల్గొన్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ దివాలా తీసిన సంస్థ అని మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదే ఐఆర్బీ సంస్థ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ పలు రోడ్లను లీజుకు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ టు షామ్లాలో టీవోటీ తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా లీజుకు ఇచ్చిందో, రాజస్థాన్‌లోనూ అదే విధంగా లీజుకు ఇచ్చారని వెల్లడించారు. ఛిత్తోడ్‌గఢ్ టు గులాబ్‌పుర, గులాబ్‌పుర టు కిషన్‌ఘర్, జైపూర్ టు థియోలిని కూడా ఐఆర్బీ సంస్థే లీజుకు తీసుకున్నదని వివరించారు. కర్ణాటకలోనూ థుంకూర్ టు చిత్రదుర్గ, కార్వార్ టు కుందాపూర్ను వాళ్లే తీసుకున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని యశ్వంత్రావ్ చౌహాన్ ఎక్స్‌ప్రెస్ వే నేషనల్ హైవే ఎన్‌హెచ్-48నూ ఐఆర్బీనే తీసుకున్నదని తెలిపారు. ఐఆర్బీ సంస్థకు లీజుకిచ్చిన కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లోనూ రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందా? అని ప్రశ్నించారు.
ఐఏఎస్‌లపైనా ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, సోమేశ్‌కుమార్, అంజనీకుమార్‌తో పాటు ఇతర ఐఏఎస్‌లపైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను బీహార్ వాళ్లు నడుతున్నారంటూ సివిల్ సర్వీసెస్ అధికారులను కించపరుస్తున్నారని వెల్లడించారు. యూపీఎస్సీ వారిని ఏ రాష్ర్టానికి అలాట్ చేస్తే ఆ రాష్ర్టానికి వచ్చి సేవ చేస్తారని, ఇలాంటి వాళ్లను ఉద్దేశించి వాళ్ల అంతుచూస్తాం, జైళ్లలో పెడతం అనటం ఏమిటి? అని ప్రశ్నించారు. అందుకే తాను అధికారులకు ‘మనం ఏ తప్పూ చేయలేదు. పనికిమాలిన వెకిలి లేకి మాటలు పడాల్సిన ఖర్మ మాకు లేదు. వెంటనే పరువునష్టం దావా వేయండి’ అని చెప్పానని అన్నారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఐఏఎస్ అధికారులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అంతుచూస్తామని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే ఇక్కడ పడటానికి ఎవరూ సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు.
ప్రజల్ని ఎండబెట్టాలా?
కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, కేంద్రమేమో మెడపై కత్తిపెట్టి రావాల్సిన పైసలు రానివ్వటం లేదని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల సమీకరణకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ కమిటీ వేయకుండా మరేం చేయాలని ప్రశ్నించారు. ప్రజల్ని ఎండబెట్టాలా? కల్యాణలక్ష్మి ఆపాల్నా, రైతుబంధు ఆపా ల్నా, రైతుబీమా ఆపాల్నా, పెన్షన్లు ఆపాల్నా? ఏం చేయాలన్నారు. వీటిని కొనసాగించేందుకుగానూ కమి టీ నేతృత్వంలో నిధులు సమకూర్చే ఓఆర్ఆర్ను గు ర్తించినట్టు వివరించారు. తాము ఓఆర్ఆర్పై ఓనర్‌షిప్‌ను వదులుకోవటం లేదని, 30 ఏండ్ల తర్వాత ప్రజ ల ఆస్తి ప్రజలకే ఉంటుందని స్పష్టం చేశారు. రూ. 7,380 కోట్లకు లీజుకు ఎలా ఇస్తారని, 30 ఏండ్లకు ఓఆర్ఆర్తో 2.70 లక్షల కోట్లు వస్తాయని, అంత త క్కువగా ఎలా ఇస్తారు? అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. ప్రస్తుత టెండర్ ద్వారా సమకూరే రూ.7,380 కోట్లను ప్రభుత్వం ఇతర రంగాలపై పెట్టుబడి పెడితే దీని విలువ రూ.1.33 లక్షల కోట్లకు పెరుగుతుందని తెలిపారు.
కొన్ని పత్రికలు విష పుత్రికలు
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు కొన్ని ఉన్నాయని, వాళ్లకు సీఎం కేసీఆర్‌పైనా, తమ ప్రభుత్వంపైనా అక్కసు ఉన్నదని అన్నారు. ప్రతి రోజు తమపై విషం చిమ్మటమే వారి పని అని, తెలంగాణ బాగుపడితే వారికి నచ్చదని తెలిపారు. ఇలాంటి వాళ్లు రాసింది ప్రామాణికమా? అని ప్రశ్నించారు. రేపు వాళ్లే మీపై (భట్టి)పై రాస్తే అది నిజమైనట్టేనా? అని కాంగ్రెస్ నేత భట్టిని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ వర్కర్స్కు వేతనాలు కేవలం రూ.1,500-రూ.3 వేలు ఇస్తే, తాము రూ.9 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. అలాంటి పార్టీ ఇప్పుడు వాళ్లపై మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు.
ఆర్టీఐ.. కొందరికి రూట్ టు ఇన్కమ్
ఓఆర్ఆర్ టెండర్‌తో పాటు ఇతర అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, నోరు తెరిస్తే వేల కోట్ల కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం అంటూ వ్యాధివచ్చిన వాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త సచివాలయం కట్టే సమయంలో పాత సచివాలయం కింద రూ.10 వేల కోట్ల నేలమాగాని ఉన్నదని, సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి సొరంగం తవ్వి వాటిని తెచ్చుకుంటున్నారని రేవంత్‌రెడ్డి అన్న మాటల్ని గుర్తు చేశారు. ఇక ఆర్టీఐ అనేది తమందరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అయితే, కొందరికి రూట్ టు ఇన్కంగా మారిందని పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు. రేవంత్‌రెడ్డి ఇటు అధికారులను, అటు కాంట్రాక్ట్ సంస్థలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై ఇప్పటికే హెచ్ఎండీఏతో పాటు సదరు సంస్థ కూడా రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేశాయని పేర్కొన్నారు.
ఇదేనా సంస్కారం
సీఎం కేసీఆర్‌ను కూడా నోటికొచ్చినట్టు తిట్టడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘ఉరేసి రాళ్లతో కొట్టాలి.. పిండం పెట్టాలి’ అంటూ సీఎం కేసీఆర్ గురించి రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇదేనా సంస్కారం. ఇదేనా ఓ నాయకుడు మాట్లాడే మాటలు. 70 ఏండ్ల వయసున్న నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, రెండు సార్లు ప్రజలచే సీఎంగా ఎన్నికైన నాయకుడిని సంస్కారహీనంగా మాట్లాడటం ఏమిటి’ అని ప్రశ్నించారు.
రాబందులొస్తున్నాయి.. ప్రజలారా జాగ్రత్త
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు కూడా అనేక విధాలుగా ఆలోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఓ సామెత చెప్పారు. ‘ఇన్ లైఫ్ వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్.. యూ డిసైట్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్’ అనే సామెత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలనేది దీని ఉద్దేశం అని తెలిపారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో కొన్ని రాబందులు మళ్లీ తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
కేటీఆర్ పంచ్