హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్నల కోసం అనేక కొత్త పథకాలు తీసుకురానున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు. ఈ ఏడు రోజులు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటుచేయనున్నట్టు, రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ ఫంక్షన్ హాల్లో 7,500 మంది నేతన్నలతో రాష్ట్ర స్థాయి చేనేత సంబురాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
‘ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవ సంబురాలే కాకుండా అనేక నేతన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించబోతున్నది. చేనేత మిత్ర కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. దీనికి అదనంగా నేతన్నలకు బీమా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పిట్ లూమ్స్‌ను ఫ్రేమ్ లూమ్స్గా అప్‌గ్రేడ్ చేసేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. హైదరాబాద్‌లోని శిల్పారామంలో చేనేత హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం, ఉప్పల్ భగాయత్‌లో కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సంబురాల్లో పాలుపంచుకోవాలని, నేతన్నలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
దిగ్విజయంగా నేతన్నకు చేయూత, నేతన్న బీమా పథకాలు
‘నేతన్నలకు చేయూత కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు పొదుపు చేసే 8 శాతానికి రెట్టింపుగా 16 శాతం, పవర్‌లూం కార్మికులు పొదుపు చేసుకునే 8 శాతానికి అదనంగా మరో 8 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. 2017లో ప్రారంభమైన ఈ పథకాన్ని కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లాకింగ్ పీరియడ్‌ను సవరించి మరీ ముందస్తు వెసులుబాటు ఇవ్వటంతో నేతన్నలు రూ.100 కోట్ల మేర ప్రయోజనాన్ని అందుకున్నారు. నేత కార్మికుల కోరిక మేరకు ఈ పథకాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ ప్లాన్‌తో తిరిగి ప్రారంభించాం. ఇందులో 32,328 మంది చేనేత కార్మికులు చేరారు. రాష్ట్రంలోని రైతన్నలకు అందుతున్న రైతు బీమా మాదిరే నేతన్నకు ప్రత్యేకంగా రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 59 ఏండ్ల కన్నా తకువ వయసున్న 40,000 మంది నేతన్నలకు బీమా కవరేజ్‌ను అందిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. నేతన్నలను ఆదుకొనేందుకు తీసుకొచ్చిన అనేక పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి అధికార బృందాలు రాష్ట్రంలో పర్యటించి మన పథకాలను అధ్యయనం చేశాయని వివరించారు.
అంతరించిన చేనేత కళాకృతులకు జీవం
చేనేత కళ అంతరించి పోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో టెస్కో ద్వారా ప్రత్యేక ఆర్అండ్డీ విభాగాన్ని ఏర్పాటు చేసి, అంతరించిపోయిన కళాకృతులకు జీవం పోస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పీతాంబరి పట్టు చీరలు, ఆర్మూరు పట్టు చీరలు, హిమ్రా చేనేతలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, మహాదేవ్‌పూర్ టస్సర్ పట్టుచీరల వంటి గొప్ప కళాకృతులను మనుగడలోనికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.
నేతన్నల జీవితాల్లో వెలుగులు
‘విప్లవాత్మకమైన కార్యక్రమాలతో అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇదే స్ఫూర్తితో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నాం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. గతంలో అప్పులతో ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. దాంతో 10,148 నేత కార్మికులకు రూ.28.97 కోట్ల మేర రుణ విముక్తి కలిగింది. మగ్గాలకు జియో ట్యాగింగ్, చేనేత మిత్ర పథకం ద్వారా వస్త్రాలు, రసాయనాల కొనుగోలుకు 50% రాయితీ అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 20,500 మంది నేతన్నలకు రూ.41.2 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేశాం’ అని వెల్లడించారు.