హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనపై హైదరాబాద్ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యాచారం కేసులో మైనర్లను మేజర్లుగానే శిక్షించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఓ మైనర్.. మేజర్లా క్రూరమైన అత్యాచారానికి పాల్పడితే.. అతన్ని మేజర్‌గానే పరిగణించి శిక్షించాలి. అతన్ని జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అత్యాచారం కేసు నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును హైదరాబాద్ పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే సమయంలో ఐదుగురిని మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు పోలీసుల వినతిపై జువైనల్ జస్టిస్ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటిని పరిగణలోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.
మరోవైపు… ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 4 రోజుల పాటు నిందితుని పోలీసులు విచారించనున్నారు. కాగా… ఇదే ఘటనకు సంబంధించి జువైనల్ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని ఏసీపీ తెలిపారు.
I welcome & support the stand of @TelanganaCOPs
If you are adult enough to commit a crime as heinous as rape, one must also be punished as an adult
& not as a juvenile https://t.co/Pp3ALBzbfx— KTR (@KTRTRS) June 9, 2022