సంగారెడ్డి, జూలై 11(నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని ఆస్ట్రియా రాయబారి క్యాథరీనా వైజర్ ప్రశంసించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో అల్‌ప్లా కంపెనీలో కొత్తగా ఏర్పాటు చేసిన వరల్డ్‌క్లాస్ మౌల్డింగ్ యూనిట్, డ్యుయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను క్యాథరీనా వైజర్, అల్‌ప్లా గ్లూప్ సీఈవో ఫిలిప్ లెహ్నర్, ఎండీ వాగీశ్ దీక్షిత్, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో క్యాథరీనా వైజర్ మాట్లాడుతూ.. భారతదేశం, ఆస్ట్రియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, అల్‌ప్లా కంపెనీ విస్తరణే దీనికి నిదర్శనమని చెప్పారు. తాను తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నట్టు చెప్పారు. అల్‌ప్లా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆస్ట్రియా ఎడ్యుకేషన్ మోడల్ దీనికి ప్రేరణ అని పేర్కొన్నారు.
హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతున్నదని అల్‌ప్లా గ్రూప్ సీఈవో ఫిలిప్ లెహ్నర్ తెలిపారు. ఎన్నో బహుళజాతి కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. నైపుణ్య సంక్షోభానికి డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ పరిష్కారమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే అల్‌ప్లా కొత్త ప్లాంటు, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు సాధ్యమైందని సంస్థ ఎండీ వాగీశ్ దీక్షిత్ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్ల్లొమా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఆల్ప్లా కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. అల్ప్లాలో మూడు షిఫ్టుల్లో మహిళా ఇంజినీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఐదు విప్లవాలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఐదు విప్లవాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. పంటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు పెరిగి సస్య విప్లవం(గ్రీన్ రెవల్యూషన్) కొనసాగుతున్నదని చెప్పారు. వరి సాగు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రీన్ రెవల్యూషన్లో భాగంగానే గద్వాల, వనపర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నీలి విప్లవం(బ్లూ రెవల్యూషన్) కూడా కొనసాగుతున్నదని, చేపల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగంలో ఉన్నదని కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు.
రాష్ట్ర రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెరగడంతో ఆక్వా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. అమెరికాకు చెందిన ఫిష్ఇన్ కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో టిలాతియా చేపలు పెంచి తీసుకెళ్తున్నదని తెలిపారు. క్షీర విప్లవం(వైట్ రెవల్యూషన్)లో భాగంగానే గతంలో మూతపడే స్థితిలో ఉన్న విజయ డెయిరీ, ప్రభుత్వ ప్రోత్సాహంతో డివిడెండ్ ఇచ్చేస్థాయికి ఎదిగిందని చెప్పారు. న్యూజిలాండ్‌లో డెయిరీ కంపెనీ ఫౌంటెర్రా తన కార్యకలాపాల ద్వారా దేశ జీడీపీలో 8 శాతం సమకూరుస్తున్నదని వివరించారు. గొర్రెల పంపణీ ద్వారా రాష్ట్రంలో పశుసంపద పెరిగి గులాబీ విప్లవం (పింక్ రెవల్యూషన్) కొనసాగుతున్నదని తెలిపారు. ప్రభుత్వం మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నదని, దీంతో ఎగుమతులు పెరిగినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా నుంచి వంటనూనెలు దేశానికి దిగుమతి అవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించి పసుపు విప్లవం(ఎల్లో రెవల్యూషన్)ను కొనసాగిస్తున్నదని తెలిపారు. ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 15 శాతం ఆయిల్‌పామ్ సాగు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ర్టానికి కొత్త పరిశ్రమలు తరలివస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డెరెక్టర్ బీఎస్ మూర్తి, సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, రాష్ట్ర సాంకేతికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలకు 24 గంటల కరెంటు సరఫరా
తెలంగాణలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఎలాంటి రాజకీయ వేధింపులు లేవని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలిస్థానంలో ఉండటంతో పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలపై ట్యాక్స్దాడులు లేవని, రాజకీయ ఒత్తిడులు లేవని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణలో ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో స్థిరమైన, సామర్థ్యం ఉన్న ప్రభుత్వం ఉండటంతో ఉత్పత్తి, సేవారంగాల్లో జాతీయసగటు కంటే రాష్ట్ర సగటు శాతం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఫార్మా, కెమికల్, వ్యాక్సిన్ రంగాల్లో అగ్రభాగంలో ఉన్నామని, సమ్మిళిత అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తూ.. అన్నిరంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొన్నారు. దిగుమతులకు చరమగీతం పాడుతూ ఎగుమతులు పెరిగేలా రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చర్ బేస్‌ను తయారుచేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్తు సరఫరా చేయాలని ధర్నాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిశ్రమలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో పరిశ్రమల్లో మూడు షిఫ్టులు పనిచేస్తున్నారని తెలిపారు. అల్‌ప్లా గ్రూప్ పరిశ్రమను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం, ఎడ్యుకేషనల్ సెంటర్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉన్నదని అన్నారు. ఆస్ట్రియా నుంచి తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని ఆ దేశ రాయబారి క్యాథరినా వీజర్ను కోరారు.