హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) వల్ల సామాన్యులకే కాకుండా పారిశ్రామికాధిపతులకు కూడా అనేక ప్రయోజనాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఐఏఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో నిర్వహించిన ‘ఫైర్ సైడ్ చాట్’లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో, పరిశ్రమల మధ్య నెలకొన్న వివాదాలను ఐఏఎంసీ ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకొస్తే అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు. లిటిగేషన్ తగ్గుతుందని, సత్వర న్యాయం లభిస్తుందని, సమయం, డబ్బు ఎంతో ఆదా అవుతుందని, ఫలితంగా అనేక కొత్త సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చెప్పారు.
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక ఐఏఎంసీ ఏర్పాటైందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, దేశ, విదేశాల నుంచి పలు సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏవైనా వివాదాలు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఐఏఎంసీ ఉంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఐఏఎంసీ వల్ల లాభాలు, దాని పనితీరును వివరించేందుకు పరిశ్రమల ప్రతినిధులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్ కృషి కారణంగానే ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటైందని అన్నారు.
త్వరలో అన్ని జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు
పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి తమ ప్రభుత్వం వెంటనే చేయూతనిస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లోని ఎంఎస్ఎంఈల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు పూర్తి విశ్వాసం కల్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాణిజ్యవేత్తలకు కూడా హక్కులు ఉంటాయని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు తమ వ్యాపారాలను వృద్ధి చేయడంతోపాటు నాణ్యత, ప్రమాణాల కల్పనకు కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు.
ఆర్థిక బలోపేతానికి పునాది: సీజే
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్బిట్రేషన్ ఎంతో అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జ్ఞల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీల వ్యాపారాల్లో పోటీ ఉంటుందని, ఈ నేపథ్యంలో ఏర్పడే వివాదాలు దీర్ఘకాలం కొనసాగకుండా ఉండాలంటే ఆర్బిట్రేషన్ ఎంతో కీలకం అవుతుందని తెలిపారు. ఇప్పుడు అన్ని స్థాయిల్లోనూ ఆర్బిట్రేషన్ పెరుగుతున్నదని చెప్పారు. ఆర్బిట్రేషన్ ఉంటేనే కంపెనీల వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్‌లోని ఐఏఎంసీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు లభిస్తున్నదని తెలిపారు. కోర్టుల్లో కేసుల విచారణకు, పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ ఎంతో కీలకంగా మారుతుందని చెప్పారు. ఆర్బిట్రేషన్‌లో అవార్డుల అమలుకు పార్టీలు ప్రయత్నించాలని కోరారు.
సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాల షరతుల్లో సమస్య తలెత్తితే ఆర్బిట్రేషన్ విధానంలో పరిష్కరించుకుంటామని ఒప్పందాలు రాసుకోవాలని సూచించారు. ఆర్బిట్రేషన్ నిఫుణులతో ప్రత్యేక బార్ ఏర్పాటు అవసరమని ఆర్బిట్రేషన్ సంస్కరణలపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు. ఐఏఎంసీ ఏర్పాటుకు, వసతుల కల్పనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అందజేసిన సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీకే రాజా, ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ ఖాన్, పలువురు న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు.