హైదరాబాద్: తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ (Telangana) దళిత పారిశ్రామికవేత్తలు దేశానికే ఆదర్శంగా ఎదగాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతుంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ బేగంపేటలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ (BR Ambedkar) జయంతి వేడుకలకు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ ద్వారా ప్రోత్సాహకాలు, అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. అందరికీ ఒకే ఓటు హక్కు ఉండాలని బాబాసాహెబ్ ఆలోచించారని తెలిపారు. ఆయన ముందుచూపుతో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు వచ్చిందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతమే తనకు ఆదర్శమని చెప్పారని వెల్లడించారు.
దళితబంధు (Dalit Bandhu) వంటి పథకాలను ప్రవేశపెట్టాలంటే సీఎం కేసీఆర్ (CM KCR) లాంటి దమ్మున్న నాయకుడికే సాధ్యమన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు. దళితబంధు యూనిట్లను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని సూచించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు ఊహించనంతగా పెరిగాయన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే నిర్మించుకున్నామని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక నదినే మలిపామన్నారు. ప్రాజెక్టు నీటితో రిజర్వాయర్లు కళకలాడుతుంటే విపక్ష నేతలకు కనిపించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ మొండిగా ముందుకెళ్లి నాలుగేండ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేశారని తెలిపారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పారు. కుల, మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోతేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
Join us for a live stream of Minister @KTRBRS speaking at the birth anniversary celebrations of Dr. B.R. Ambedkar, organized by the Industries and Commerce Department, Government of Telangana. https://t.co/MKjGZWjBwe
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 13, 2023