RAnveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ప్రేక్షకుల సందడి మరింత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ‘దురంధర్’ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఘన విజయం నేపథ్యంలో రణవీర్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భార్య దీపికా పదుకునే గతంలో చేసిన 8 గంటల వర్క్ కామెంట్స్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పని గంటల విషయంలో దీపికా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసి, ఆమెకు ట్రోలింగ్ కూడా తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల కారణంగా ఆమె రెండు భారీ ప్రాజెక్టులు కోల్పోయిందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ అంశంపై స్పందించిన రణవీర్ సింగ్, “పని గంటల విషయంలో చాలాసార్లు నా సహనటీనటులు నాపై ఫిర్యాదు చేస్తుంటారు. ఎందుకంటే నేను కొన్నిసార్లు 10 నుంచి 12 గంటల వరకు షూటింగ్ చేస్తాను. అప్పుడు వాళ్లూ అలాగే కొనసాగాల్సి వస్తుంది. దాంతో వారి ఇతర సినిమాల షెడ్యూల్‌లకు ఇబ్బంది అవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో 8 గంటల్లో షూటింగ్ పూర్తవదు కదా. అప్పుడు ఎక్కువ సేపు పనిచేయడంలో తప్పేముంది?” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రణవీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. భర్త చేసిన ఈ వ్యాఖ్యలపై దీపికా పదుకునే ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పెరుగుతోంది. మరోవైపు, ‘దురంధర్’ సక్సెస్‌తో రణవీర్ సింగ్ కెరీర్ మరోసారి గట్టి బూస్ట్ అందుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.